కరుణాసంపన్నుడు
(ఎఫెసి 2:4) అయినను దేవుడు కరుణాసంపన్నుడైయుండి మనము మన అపరాధముల చేత చచ్చినవారమై యుండినపుడు సహితము మనయెడలచూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను.
మానవులమైన మనము తోటి వారిని గుర్తించి నాలుగు మంచి మాటలు చెప్పడము చాల కష్టం, మంచిని అసలు గుర్తించలేము. దేవుని ఙ్ఞానం తోడుంటే తప్ప మంచిని గుర్తించలేము. అయినను మనము విశ్వసించిన మనప్రభువైన యేసుక్రీస్తు కరుణాసంపన్నుడు, ఆ ఒక్క పేరే కాదు దయగలవాడు, ప్రేమగల దేవుడు, కృపచూపువాడు అని ఎన్నో విధములుగా ప్రార్థిస్తుంటాము.
ఆ కరుణా సంపన్నుడు మనము అపరాధములచేత చచ్చినవారమై యుండినపుడు తన మహాప్రేమ చూపించినాడు. దేవుని ఎరుగని స్తితిలో, పాపములో, ఈ లోకపాప కూపములో పడి చచ్చిన వారిలా యుండినపుడు, తోటివారు మనలను పట్టించుకోని సమయాన అంతే కాదు, మనమందరము దేవుని శిక్షకు తగినవారము. అయినను, దేవుడు మనలను శిక్షించక తన మహాప్రేమను చూపుతూ పాపులమైన మనపట్ల కరుణా సంపన్నుడైనాడు, మానవులమైన మనము దారితప్పి నశించి పోతున్న మనుషులపట్ల దేవుని జాలి, కనికరము, ప్రేమ ఒక్కసారిగా ప్రవహించాయి. దేవుని ప్రేమ కేవలం మాటలో కాదు, క్రియల్లో కనిపించినది అదే ప్రాణత్యాగం.
క్రీస్తు ప్రేమ సర్వలోకమును కరుణించిన ప్రేమ, మనము పాపములో నశించిపోకుండ మనకు శాశ్వత జీవం ఇవ్వాలని, దేవుని కోరిక దేవునితో సహవాసంలోని జీవం పొందుకొని పాపమను నీడకూడ మనకు రాకుండా మార్గము చూపి కరుణించిన ఆ దేవాదిదేవుడు మనకు చాలినంతగా కరుణా సంపన్నుడైనాడు.
ఆ దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్!